కేసీఆర్ సార్ మీరు మారారు.. మునుపెన్నడూ లేని విధంగా స్క్రిప్ట్ చదివిన సీఎం

రచ్చబండ, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అపర చాణక్యుడు.. అపర మేధావి.. అనర్గళ ఉపన్యాసకుడు.. పట్టు వదలని విక్రమార్కుడు.. అని అంటుంటారు. తెలంగాణపైనే కాదు.. దేశంపైనా సంపూర్ణ అవగాహన కలిగిన నేతగా గుర్తిస్తారు. ఆయన మాటల్లో కూడా పరిపక్వత స్పష్టంగా కానవస్తుంది.

అలాంటి కేసీఆర్ ఎవరి మాటా వినని సీతయ్యగా కూడా కొందరు విమర్శకులు బహిరంగంగా, స్వపక్షీయులు లోలోన అంటుంటారు. కానీ ఆయనలో కొంత మార్పు గోచరిస్తుంది. ఇది తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవ సభలో స్పష్టంగా కనిపించింది.

టీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఆ పార్టీ సభల్లో, సీఎంగా అసెంబ్లీ సెషన్లలో, ఉద్యమ నేతగా నాటి తెలంగాణ పోరుబాటలో అనర్గళంగా ఆశువుగా ఉపన్యాసం ఇచ్చి జనాన్ని మైమరిపించారు. తన మాటల చాతుర్యంతో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు.

అప్పటికప్పుడు వచ్చిన పదజాలాన్ని ఆశువుగా మాట్లాడగల దిట్ట. శాసన సభలోనూ చేతిలో స్క్రిప్ట్ ఉన్నా లెక్కల సంఖ్య కోసమే పేపర్ చూస్తూ మిగతా అంశాన్ని పేపర్ చూడకుండానే ఆసాంతం వల్లె వేసే నాలెడ్జి ఆయన సొంతం.

సభలు, సమావేశాల్లోనూ మారుమూల ప్రాంతాల గురించి, వాటి లెక్కలను నోటికే అప్పజెప్పేవారు. అలాంటి కేసీఆర్ శనివారం హైదరాబాద్ లో జరిగన తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవ సభలో ఆసాంతం వెంట తెచ్చుకున్న స్క్రిప్ట్ చదువుతూ ఉపన్యసించారు. ఇదేదో పెద్ద విషయమేమీ కాదని అనిపించవచ్చు. కానీ కేసీఆర్ వైఖరిని అబ్జర్వ్ చేసే వారికి మాత్రం మార్పు స్పష్టంగా గోచరిస్తుంది.

మునుపెన్నడూ లేని విధంగా ఆశువుగా అనర్గళంగా మాట్లాడే కేసీఆర్ ఆసాంతం స్క్రిప్ట్ చదవడమేమిటని విశ్లేషకుల్లో సైతం అనుమానం వ్యక్తమవుతోంది. తప్పులు మాట్లాడినా దానినే ఒప్పుగా మలిచే చాకచక్యమున్న కేసీఆర్ వైఖరిలో వచ్చిన మార్పునకు కారణమేంటని వారు ప్రశ్నించుకుంటున్నారు.

ఎవరి మాటా వినని కేసీఆర్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడంపై పలు భాష్యాలు చెప్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17 రోజును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ దశలో వేర్వేరు ఉత్సవాలు జరుపుతున్నాయి.

టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ కొరకరాని కొయ్యగా మారిన ఈ తరుణంలో దానికి దీటుగా సమాధానం చెప్పేందుకే ఇలా సిద్ధమైనట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.

సెప్టెంబర్ 17 సందర్భంగా సున్నితాంశాలు ఇమిడి ఉండటంతో ఆచీతూచి మాట్లాడేందుకు తయారు చేసుకొచ్చిన స్క్రిప్ట్ తోనే కానిచ్చేశారని కొందరు పేర్కొంటున్నారు.

స్క్రిప్ట్ లో అన్ని వర్గాల, పార్టీల, మతాల అభిమానాన్ని చూరగొనేలా ఉండటం ముదావహం. ఎలాంటి కాంప్లికేటెడ్ అంశాలు లేకుండా చూసుకునేందుకే ఇలా చేసి ఉంటారని అంటున్నారు. ఏదేమైనా.. కేసీఆర్ సార్ మారారు.