టీఆర్ఎస్ కు మరో షాకిచ్చిన కాంగ్రెస్.. తగ్గేదెలే.. అనేలా రేవంత్ దూకుడు

కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాక సంస్థాగత బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. సభలు, సమావేశాలతో కార్యకర్తల్లో భరోసా కల్పించారు. తాజాగా చేరికల పర్వానికి తెరలేపారు. గత వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చేరికల దూకుడు పెరిగింది.

కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి వరుస చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా సోమవారం రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట కార్పొరేషన్ మేయర్ పారిజాతా నర్సింహారెడ్డి మరో ఇద్దరు కార్పొరేటర్లు, ఇతర నేతలతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరారు.

మేయర్ పారిజాత టీఆర్ఎస్ పార్టీకి ఆదివారమే రాజీనామా లేఖ పంపారు. 23వ డివిజన్ కార్పొరేటర్ రాళ్లగూడెం సంతోషి శ్రీనివాస్ రెడ్డి, 20వ డివిజన్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డితో సహా కొందరు నేతలు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సోమవారం మేయర్ సహా ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మేయర్, కార్పొరేటర్ల చేరికల కార్యక్రమంలో టీపీసీీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మరికొందరు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఆత్మాభిమానం చంపుకోలేక సొంతగూటికి చేరుకున్నట్లు ఈ సందర్భంగా మేయర్ పారిజాతా నర్సింహారెడ్డి తన మనోగతం తెలిపారు. 31వ వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఆమె మేయర్ పదవి ఇస్తామని ఒప్పందం జరగడంతో ఆనాడు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.