చిత్రమైన ‘దొంగ’తనం

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : ఈ దొంగకు కావాల్సింది ఏంటో? ఎందుకు ఈ దొంగతనం చేయాలనుకున్నాడో? ఏం కావాలనుకున్నాడో? ఏంటో కానీ.. విచిత్రమైన దొంగతనం చేశాడు. తన ప్రయత్నం వికటించి, మధ్యలోనే వదిలి వెళ్లిపోయాడు.. అతను చేసిన దొంగతనం ఏంటి? ఎక్కడ జరిగింది? ముచ్చట తెలుసుకుందాం రండి..

దొంగలను పట్టుకునేందుకు నిత్యం పోలీసులు పహారా కాస్తుంటారు.. గస్తీ తిరుగుతుంటారు.. ప్రజల రక్షణలో తలమునకలై ఉంటారు.. మరి అలాంటి పోలీసుల పెట్రోలింగ్‌ వాహనాన్నే ఓ విచిత్రమైన దొంగ అపహరించాడు. దాన్ని ఎలా అపహరించాడంటే?

సూర్యాపేట పోలీసులు ఓ కేసు దర్యాప్తు సమయంలో తమ పెట్రోలింగ్‌ వాహనంలో వెళ్లి కొత్త బస్టాండు సమీపంలో నిలిపి ఉంచారు. ఆ వాహనాకి తాళం చెవి ఉంది. అయితే పోలీసులు దూరంగా వెళ్లారో ఏమో కానీ ఓ దొంగ గమనించాడు. వెంటనే దాన్ని స్టార్ట్‌ చేసుకొని జాతీయ రహదారిపై రయ్‌ రయ్‌ మంటూ కోదాడ వైపు వెళ్లిపోయాడు.

ఈ లోగా వాహనం లేదన్న విషయాన్ని గమనించిన పోలీసులు జీపీఎస్‌ ఆధారంగా ట్రేస్‌ చేశారు. అది కోదాడ పట్టణంలో ఉన్నట్లు చూపించింది. వెంటనే వెళ్లి చూడగా కోదాడలోని హుజూర్‌నగర్‌ రోడ్డు పక్కన నిలిపి ఉంది. అయితే కోదాడ దాకా వాహనాన్ని తీసుకెళ్లిన దుండగుడు దానిలో డీజిల్‌ అయిపోవడంతో అక్కడ వదిలేసి ఉంటాడని భావించారు.

అయితే పోలీసుల వాహనాన్నే అపహరించాలనుకున్న ఆ దుండగుడు దాన్ని ఏం చేయాలనుకున్నాడో ఏమో కానీ భలే విచిత్రం అనిపిస్తుంది.

అయితే గతంలో కూడా సూర్యాపేట రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో, మిర్యాలగూడ పట్టణంలో ఇలాంటి ఘటనలే చోటుచేసుకోవడం గమనార్హం. పోలీసు వాహనాలకు భద్రతేమో కానీ ఇలాంటి విచిత్ర దొంగతనాలు కూడా జరుగుతుండటం మాత్రం విశేషమే కదా..