వీడు మామూలోడు కాదు.. ఆన్ లైన్ మోసగాడు.. దగాపడిన ఎందరో యువతులు

రచ్చబండ : ఆన్ లైన్ ను అడ్డా చేసుకున్న ఓ దుండగుడు అమ్మాయిలను ట్రాప్ చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నాడు. ఫేస్ బుక్ ద్వారా వ్యక్తిగత వివరాలు సేకరించి వారిపై బెదిరింపులకు పాల్పడేవాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో అడ్డంగా దొరికిపోయాడు. కృష్ణా జిల్లా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం కొండ్రపల్లి గ్రామానికి చెందిన భీమిని గణేష్ నిందితుడు. ఇతను ఫేస్ బుక్ అకౌంట్లలో ప్రైవసీ సెట్టింగులు స్ట్రాంగ్ గా లేని వాటిని ఎంపిక చేసుకుంటాడు. ఆ ఫేస్ బుక్ ఖాతాల వివరాలు సేకరిస్తుంటాడు.

సంబంధిత ఖాతా ఈమెయిల్, ఫోన్ నెంబర్లను తెలుసుకొని వాటి ద్వారా ఫేస్ బుక్ ఖాతాలు ఓపెన్ చేసి ఈ మెయిల్, ఫోన్ నెంబర్ల ఆధారంగా పాస్వర్డును ఛేదిస్తాడు. ఆ తర్వాత ఎఫ్బీ అకౌంట్లలోకి చొరబడి, వారి వ్యక్తిగత సమాచారం తెలుసుకొని, యువతులను ట్రాప్ చేసి, వారి నుంచి డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేస్తుంటాడు.

దుండగుడి మోసాలిలా..
కృష్ణా జిల్లా గూడూరుకు చెందిన ఓ యువతి చదువుకుంటూ పార్ట్ టైంగా ఆన్ లైన్ ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగంలో భాగంగా ఒక యాప్ ను ప్రమోట్ చేసే విషయంలో ఫేస్ బుక్ స్టేటస్ ను షేర్ చేసింది. ఏడాది క్రితం ఫేస్ బుక్ ద్వారా గణేష్ వికాస్ రామ్ అనే ఐడీ ద్వారా పరిచయం అయ్యాడు.

ఫేస్ బుక్ స్టేటస్ చూసి ప్రమోట్ చేస్తానని మాట కలపడంతో యాప్ డౌన్లోడ్ చేయగానే ఓటీపీ వస్తుందని, ఆ ఓటీపీ నెంబర్ చెప్పాలన్నాడు. ఆమె ఇచ్చిన ఫోన్ నెంబర్ పనిచేయడం లేదని, ఇంట్లో వారి నెంబర్లు ఇవ్వాలంటూ అడిగాడు. ఆ మేరకు ఇంట్లో వారి నెంబర్లు ఇచ్చింది.

అప్పటి నుంచి ఆ యువతికి చుక్కలు చూపించాడు. ఆ యువతి ప్రొఫైల్ ఫొటోపై బాధిత యువతి మొబైల్ నెంబరు, వారి కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు టైప చేసి ఆ ఫొటోను సెక్స్ కాల్ గా అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. అప్పటికే తన వద్ద ఉన్న మిగతా ఫేస్ బుక్ అకౌంట్లకు శాంపిల్ గా షేర్ చేశాడు. ఆ స్క్రీన్ షాట్లను బాధిత యువతికి పంపాడు.

తాను చెప్పినట్లు చేస్తే వాటిని తొలగిస్తానని, లేకుంటే మిగతా గ్రూపులలో షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో నిస్సహాయురాలైన ఆ యువతి ఆ దుండగుడు చెప్పినట్లు అసభ్యకరంగా వీడియో కాల్ చేసింది. వెంటనే ఆ నిందితుడు స్క్రీన్ రికార్డు ద్వారా వీడియో రికార్డు చేసి, డబ్బు కోసం పదే పదే బెదిరించాడు. ఆ యువతి ఏం చేయాలో తెలియక స్పందన కార్యక్రమంలో మచిలీపట్నం ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు స్పందించిన ఎస్పీ ఆ ఫిర్యాదును దిశ మహిళా పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. దానిపై లోతుగా విచారణ జరిపితే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడైన గణేష్ కేవలం బాధిత యువతితో పాటు ఎంతో మంది యువతులను ఇలాగే మోసం చేశాడని నిర్ధారణ అయింది.

ఇతను సేకరించిన యువతుల ఫొటోలను అబ్బాయిలకు షేర్ చేసి అమ్మాయిలు కావాలంటే నగదు పంపాలంటూ సొమ్ము చేసుకునేవాడని తేలింది. ఈ క్రమంలో గూడూరు యువతికి జరిగిన మోసంపై పోలీసుల రంగ ప్రవేశంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

నిందితుడు పట్టుబడిన వైనం
దిశ పోలీసులు చాకచక్యంగా వ్యవహారించి నిందితుడికి గూడూరు యువతితో ఫోన్ చేయించారు. నగదు తీసుకునేందుకు గూడూరు రావాలంటూ చెప్పించారు. ఎప్పటికప్పుడు అతడిపై నిఘా ఏర్పర్చారు.

ఈ మేరకు దిశ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ నరేశ్ కుమర్ ఇతర సిబ్బంది కలిసి గూడూరు సెంటర్లో వేచి ఉన్నారు. చెప్పిన చోటుకు నిందితుడు గణేష్ రాగానే చాకచక్యంగా అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు.

సులభ సంపాదనకు అలవాటు పడినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు. ఈ ఆన్ లైన్ మోసాన్ని ఇతరుల నుంచి నేర్చుకున్నట్లు చెప్పాడు. ఈ మేరకు పలువురు అమ్మాయిలను తాను మోసి చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.