రాష్ట్రపతి ఎన్నికకు నగారా!

దేశ ప్రథమ పౌరుడు, దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ రానే వచ్చింది. జూలై 24తో ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం ముగియనుంది. ఆలోగానే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా ఎన్నికల కమిషన్ సన్నద్ధమైంది.

ఈనెల 15వ తేదీన రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 29 నామినేషన్ల చివరి గడువు.ఇదేనెల 30న స్ర్కూట్నీ ఉంటుంది. వచ్చేనెల 2న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. జూలై 18న పోలింగ్, అదే నెల 21న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈనెల 24లోపు ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

ఈ మేరకు 25న కొత్త రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ ను విడుదల చేశారు.

రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకోనున్నది. ఎలక్టోరల్ కాలేజీలో లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. ఒక్క ఎంపీ ఓటు విలువ 700 ఉండగా, మొత్తం ఎంపీలు 776 మంది ఉన్నారు. ఎమ్మెల్యేలు 4,120 మంది ఉన్నారు.

ఎంపీల మొత్తం ఓట్ల విలువ 5,43,200, ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 5,43,231 ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజీ మొత్తం ఓట్ల విలువ 10,98,903. వీటిలో 5,34,680 ఓట్లు పొందిన అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికవుతారు.