ఆ కోరికలు తీరకుండానే కన్నుమూసిన కృష్ణంరాజు.. కుమిలిపోతున్న ప్రభాస్, కుటుంబ సభ్యులు

రచ్చబండ, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి రెబల్ స్టార్ ఉప్పలపాటి కృష్ణంరాజు (83) మరణం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ తెలుగు ప్రజల్లో విషాదం నిండుకుంది. ఆయన హైదరాబాద్ లో ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు.

కృష్ణంరాజుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

1966లో చిలుకా గోరింక సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన కృష్ణంరాజుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొడుకు వరుస అవుతారు. ఆయన తమ్ముడి కొడుకు ఆయన. గోపీకృష్ణ మూవీస్ ద్వారా పలు సినిమాలను నిర్మించారు. భక్తకన్నప్ప సినిమాతో ఆయనకు స్టార్ డమ్ వచ్చింది. అమరదీపం సినిమాతో ఆయనకు నంది అవార్డు వచ్చింది. రాధేశ్యామ్ ఆయన చివరి సినిమా.

సినీ, రాజకీయ రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న కృష్ణంరాజు కొన్ని కోర్కెలు తీరకుండానే లోకం విడిచి వెళ్లారు. తన వారసుడిగా చెప్పుకునే నటుడు ప్రభాస్ పెళ్లి చూడాలని కోరుకున్నారు. పలుమార్లు మీడియా ముందు కూడా తన మనోగతాన్ని వెల్లడించారు.

ప్రభాస్ కు తగిన జోడీ కోసం వెతుకుతున్నామని, త్వరలోనే పెళ్లి శుభవార్త చెప్తామని అనేవారు. ప్రభాస్ పెళ్లి కంటే తనకు సంతోషాన్నిచ్చే అంశం మరొకటి లేదని చెప్పేవారు. మరో కోరిక ఏంటంటే.. వీలైతే ప్రభాస్ పిల్లలతోనూ కలిసి నటించాలని ఉంది.. అని తన కోరికను చెప్పారు. అయితే ఆ రెండు కోర్కెలు తీరకుండానే ఆయన లోకం విడిచి వెళ్లిపోవడం బాధాకరమని ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు.