జనవాడను ఏ మున్సిపాలిటీలో కలుపొద్దు

 

  • గౌడిచర్ల వెంకటేశ్ ఆధ్వర్యంలో గ్రామస్థుల నిరసన

 

రచ్చబండ, శంకర్ పల్లి: జనవాడ గ్రామాన్ని ఏ మునిసిపాలిటీలో కలుపొద్దని కోరుతూ ఆదివారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జనవాడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి, గ్రామ వార్డు సభ్యుడు గౌడిచర్ల వెంకటేశ్ ఆధ్వర్యంలో గ్రామస్థులు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ మునిసిపాలిటీ వద్దు, గ్రామపంచాయతీ ముద్దు అని నినదించారు. మునిసిపాలిటీలతో ఎలాంటి అభివృద్ధి జరగదని, ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. మునిసిపాలిటీ ఏర్పడితే ఇంటి పన్నులు నాలుగింతలు అవుతాయని చెప్పారు. ఇళ్లకు అనుమతులు కూడా సరిగా దొరకవని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మునిసిపాలిటీలలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడంలేదని ఆయన తెలిపారు.

 

మునిసిపాలిటీ ఏర్పడితే గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. గ్రామ ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిపారు. జనవాడ బస్టాండ్ నుండి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ప్లకార్డులతో భారీగా ర్యాలీ నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ నాగేందర్, రాయదుర్గం సొసైటీ చైర్మన్ అరవింద్ రెడ్డి, వైస్ చైర్మన్ కాట్ని నరసింహ, ఉపసర్పంచ్ శ్రీలత రాములు, కో ఆప్షన్ సభ్యులు కె.గోపాల్, గ్రామ పెద్దలు కె. మల్లయ్య, రామచందర్, కె.చంద్రయ్య, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం చేవెళ్ల నియోజకవర్గం లోని క్యాంప్ ఆఫీసులో గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే కాలే యాదయ్యని కలిసి తమ గ్రామాన్ని ఏ మునిసిపాలిటీలో కలపొద్దని గ్రామస్తుల సంతకాలతో వినతిపత్రం అందించారు.