ఆస్పత్రులకు హరీశ్ రావు హెచ్చిరిక

హైదరాబాద్ : ఆస్పత్రులకు వచ్చే అత్యవసర కేసులను తిరస్కరిస్తే ఖచ్చితంగా వేటు పడుతుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు హెచ్చరించారు. హైదరాబాద్ లోని నిలోఫ‌ర్‌, గాంధీ ఆస్పత్రుల సూప‌రింటెండెంట్లు, అన్ని విభాగాధిప‌తుల‌తో సోమ‌వారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ కేసులు పెరగాలని ఆదేశించారు. మెడిక‌ల్‌, న‌ర్సింగ్‌, పారా మెడిక‌ల్ స‌హా అన్ని విభాగాల్లో సిబ్బందిని నూరు శాతం నియ‌మించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రజలకు మ‌రింత‌ నమ్మకం పెరిగేలా సేవ‌లందించాల‌ని హితవు పలికారు. గాంధీలో మోకాలు, తుంటి ఎముక‌ల మార్పిడి సర్జరీలతో పాటు ఇతర అవయవ మార్పిడి సర్జరీల సంఖ్య పెర‌గాల‌న్నారు.

దీంతో పాటు సంతానోత్పత్తి వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలన్నారు. సీ సెక్షన్ డెలివ‌రీలు త‌గ్గించి, సాధార‌ణ డెలివ‌రీలు ఎక్కువ‌గా జ‌రిగేలా చూడాల‌న్నారు.

మాతా, శిశు మ‌ర‌ణాలు జరగకుండా చూడాలన్నారు. వివిధ విభాగాల వారీగా జిల్లాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకి వైద్య సేవలు చేరువ చేయాలని గాంధీ వైద్యుల‌కు సూచించారు. క‌రోనా, బ్లాక్ ఫంగ‌స్ చికిత్స విష‌యంలో గాంధీ వైద్యులు, సిబ్బంది బాగా ప‌ని చేశార‌ని మంత్రి అభినందించారు.