ఖమ్మంలో ‘కారు’కు గేర్ల సమస్య

ఖమ్మం జిల్లాలో కారు పార్టీకి గేర్ల సమస్య వచ్చి పడింది. అధిష్టానం కూడా చూసీచూడనట్లుగా ఉండటంతో తరచూ ఈ సమస్య ఆ పార్టీని వేధిస్తోంది. ఉద్దండ నేతలు ఉన్నా భవిష్యత్ మాత్రం అగమ్యగోచరంగానే కానవస్తోంది. ఎవరికి వారే యమునా తీరే అన్న రీతి కనిపిస్తోంది. ముఖ్య నేతలు ఉమ్మడిగా కలిసి ఉండే పరిస్థితి జిల్లాలో కనిపించడం లేదన్నది బహిరంగ రహస్యమే.

ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో జిల్లాలో ఒకే ఒక్కరైన పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయననే మంత్రి పదవి వరించింది. దీంతో మంత్రిగా అధికారిక కార్యక్రమాల్లో, పార్టీ కార్యకలాపాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. అయితే కొందరు ఇతర నేతలు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. సమన్వయం లోపించిందనే చర్చించుకుంటున్నారు.

జిల్లాలో మంత్రిగా సుధీర్ఘకాలం పాటు పనిచేసిన అనుభవం ఉన్న మరో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు. ప్రభుత్వంలో మరోసారి మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ దక్కకపోవడంతో మదన పడుతున్నారు. అయితే భవిష్యత్ కోసం, తన కేడర్ ను కాపాడుకునేందుకు ఆయన తరచూ పాలేరు నియోజకవర్గంలో సొంత కార్యక్రమాలు చేపడుతూ ప్రాబల్యం కోసం ప్రయత్నిస్తున్నారు.

జిల్లాలో విశేష కేడర్ కలిగిన మరో నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయనకూ అధిష్టానం హామీ ఇచ్చినా ఎలాంటి పదవీ దక్కకపోవడంతో సతమతం అవుతున్నారు. కేడర్ ను కాపాడుకునేందుకు ఏకంగా జిల్లాలో పర్యటిస్తూ భరోసా కల్పిస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్ కోసమే పర్యటిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా కొత్తగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైన తాతా మధు, రేగా కాంతారావులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని తాజాగా చర్చ జరుగుతోంది. పార్టీ కార్యకలాపాలు తమ కన్నుసన్నల్లోనే జరగాలని వారిద్దరూ కొరుకుంటున్నట్లు తెలుస్తోంది. పైనేతల పరిస్థితి ఎలా ఉన్నా పార్టీలో తమ ఉనికిని చాటుకునేందుకు వారిద్దరూ తహతహలాడుతున్నట్లు అర్థమవుతోంది.

దీంతో ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారని, సమన్వయం లోపించిందని ఆ పార్టీ శ్రేణులు లబోదిబోమంటున్నాయి. దీంతో ఖమ్మం కారు పార్టీలో లుకలుకలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. వీటిని సరిదిద్దేందుకు అధిష్టానం సరైన చర్యలు చేపట్టలేదనేది నగ్న సత్యం.

ఖమ్మం జిల్లాలో పార్టీని గాడిలో పెట్టేందుకు తాజాగా అధిష్టానం దృష్టి పెట్టిందని తెలిసింది. ఈ మేరకు జిల్లాకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆ పనిమీదే 18వ తేదీన రానున్నారు.

అభివృద్ధి కార్యక్రమాల కోసం వస్తున్నా.. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పార్టీని చక్కదిద్దే పని చేపట్టనున్నారని తెలిసింది. ఈ సందర్భంగా అందరినీ సమన్వయం చేసి దిశానిర్దేశం చేయనున్నారు. ఏదేమైనా ఆయన రాకతోనైనా కారు పార్టీ ఐక్యత చాటుతుందా.. ఎవరి దారి వారే చూసుకుంటారా.. అనేది వేచి చూడాలి మరి.