రాయిటర్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ గా తొలి మహిళ

ప్రపంచంలో 170 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రఖ్యాత వార్తా సంస్థ రాయిటర్స్ కు తొలిసారిగా ఓ మహిళ ఎడిటర్ ఇన్ చీఫ్ కానున్నారు. దాదాపు అన్ని దేశాల్లో ప్రతినిధులను కలిగి ఉన్న ఈ న్యూస్ ఏజన్సీ ఇప్పుడు సరికొత్త చరిత్రను సృష్టించనుంది. కేవలం 47 ఏళ్ల వయసులోనే అలెస్సాండ్రా గలోనీ అనే మహిళ ఎడిటర్ ఇన్ చీఫ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈనెల 19వ తేదీన ఆమె రాయిటర్స్ బాధ్యతలను స్వీకరించడంతో పాటు, దేశదేశాల్లోని 2,500 మంది జర్నలిస్టులకు న్యూస్ రూమ్ నుంచి మార్గ నిర్ధేశనం చేయనున్నారు.

పదవీ విరమణ చేయనున్న స్టీఫెన్ ఆల్టర్

ప్రస్తుతం రాయిటర్స్ కు ఎడిటర్ ఇన్ చీఫ్ గా స్టీఫెన్ ఆల్టర్ పని చేస్తున్నారు. ఆయన వయసు 66ఏళ్లు కాగా, ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం గలోనీ గ్లోబల్ మేనేజింగ్ ఎడిటర్ గా రాయిటర్స్ లోనే విధులు నిర్వహిస్తున్నారు. వార్తా సంస్థల్లో ఎంత మంది జర్నలిస్టులు పనిచేస్తున్నా, వారిపై కొంతమంది ఎడిటర్లు, వారిపై చీఫ్ ఎడిటర్ ఉంటారన్న సంగతి తెలిసిందే. రాయిటర్స్ లో ఇంతవరకూ ఓ మహిళకు ఈ అవకాశం దక్కలేదు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 ప్రాంతాల్లో ఉంటూ, వార్తలను పంపే వారితో ఇకపై ఆమె అనుక్షణం అనుసంధానమై ఉండాల్సి ఉంది. ఆమె మినహా మరెవరూ ప్రధాన పోస్ట్ కు సరిపడరని అందరూ అభిప్రాయపడటంతోనే ఆమెకు ఈ గౌరవం దక్కింది.

2015లో రాయిటర్స్ లో చేరిన గలోనీ

రాయిటర్స్ లో 2015లో చేరిన గలోనీ న్యూస్ ప్లానింగ్ విభాగానికి చీఫ్ గా ఉన్నారు. అంతకుముందు ఆమె వాల్ స్ట్రీట్ జర్నల్ లో దక్షిణ ఐరోపా బ్యూరోలో13ఏళ్ల పాటు పని చేశారు. ఆమె నియామకాన్ని ఖరారు చేసిన రాయిటర్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రెడెన్ బర్గ్, ఈ పదవికి అత్యంత యోగ్యులైన వారి గురించి వెతికామని, తమ సెర్చింగ్ గలోనీ దగ్గర ఆగిందని అన్నారు.

పొలిటికల్, బిజినెస్ వార్తల్లో నైపుణ్యం

గలోనీ రాజకీయ వార్తలతో పాటు, బిజినెస్ న్యూస్ రాయడంలో నిపుణురాలు. ఆమెకు నాలుగు భాషలు కూడా తెలుసు. ప్రపంచ వాణిజ్య, రాజకీయ రంగాలు ఆమెకు కొట్టిన పిండి. ఇటలీలో లాంగ్వేజ్ న్యూస్ రిపోర్టర్ గానూ ఆమె పని చేశారు. 2020లో గెరాల్డ్ లోయెబ్ ఫౌండేషన్ అందించే మినార్డ్ ఎడిటర్ అవార్డును గెలిచారు. ఓవర్ సీస్ ప్రెస్ క్లబ్ అవార్డుతో పాటు యూకే అందించే బిజినెస్ జర్నలిస్ట్ అవార్డునూ అందుకున్నారు.