రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి

• నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
మఠంపల్లి : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం, చౌటపల్లి, మఠంపల్లి, పెడవీడు గ్రామాల్లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఎన్నికల మ్యానిఫెస్టో అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ ఇప్పటి వరకూ అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ధరణి తప్పుల తడకగా మారిందని ఆరోపించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే తప్ప, ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. చరిత్రలో చిరస్థాయిగా ఉండేలా తాను మట్టపల్లి వద్ద కృష్ణానదిపై రూ.50 కోట్లతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశానని వివరించారు. అదే విధంగా పులిచింతల నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం అందేలా తాను కృషి చేసినట్లు తెలిపారు.

రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్ ను అమలు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూక్యా మంజీనాయక్, గంగసాని యల్లారెడ్డి, రామిశెట్టి అప్పారావు, సింగరపు సైదులు, బచ్చలకూరి బాబు, చిలక గురువయ్య, ఎస్కే కరీం, సింగారపు శ్రీనివాస్, నలబోతుల వెంకటయ్య, తవిడబోయిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.