డెడ్‌ సీ (మృత సముద్రం) గురించి తెలుసా?

డెడ్‌సీ (Dead sea) అని పిలిచే మృత సముద్రం ఆసియా ఖండంలోని ఇజ్రాయిల్‌, జోర్డాన్‌ దేశాల మధ్య ఉంది. సుమారు 50 కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంది. మిగతా సముద్రాలతో సంబంధం లేకుండా ఒక పెద్ద కొలనులాగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తులో ఉన్న సరస్సు. దీంట్లో సముద్రాలలో కన్నా లవణీయత (ఉప్పు శాతం) పది రెట్లు ఎక్కువ. అంటే ఉప్పు వంటి అనేక లవణాల గాఢత విపరీతంగా ఉండడం వల్ల ఇందులో చేపలు, తిమింగలాలు, నాచు, కోరల్స్‌ వంటి పెద్ద జీవజాతులు బతకలేవు. అందుకే దీన్ని మృత సముద్రం అన్నారు. కేవలం తక్కువ స్థాయిలో కొన్ని బాక్టీరియాలు, ఫంగస్‌ జీవులు ఉంటాయి.

మృతసముద్రంలో ఈత కొట్టాల్సిన అవసరం లేకుండానే నీళ్లలో తేలవచ్చు. దీనిలో ఉప్పు శాతం విపరీతంగా ఉండడం వల్ల ఈ నీటి సాంద్రత 1.24 గ్రా/మి.లీ. ఉంటుంది. అందుకే మనుషులు, ఇతర జీవులు మునగవు. మనుషులు మునగనంత మాత్రాన మిగతా వస్తువులు కూడా మునగవని అనుకోడానికి వీలు లేదు. ప్లవన సూత్రాల ప్రకారం ద్రవాల సాంద్రత కన్నా వస్తువుల సాంద్రత ఎక్కువయితే.. ఆ వస్తువులు, ఆ నీటిలో మునుగుతాయి. తక్కువయితే తేలుతాయి. కాబట్టి 1.24 గ్రా/మి.లీ. కన్నా ఎక్కువ సాంద్రత ఉన్న ఇనుము, రాళ్లు వంటివి తప్పకుండా మునుగుతాయి కాని తేలవు.