రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం.. తేలు కుట్టి బీటెక్ విద్యార్థిని మృతి

రచ్చబండ : హైదరాబాద్ లో బీటెక్ చదువుకుంటున్న ఆ యువతి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సొంతూరికి ఆనందంతో వెళ్లింది. అమ్మానాన్నలు, బంధు మిత్రులను కలవొచ్చని సంబురపడింది. పల్లెటూరు పచ్చదనాన్ని ఆస్వాదించొచ్చని ఆనందపడింది. కానీ విధి వక్రించింది. ఆ ఆనంద సమయంలోనే ఆమె ఆశలు ఆవిరయ్యాయి.

సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని రగుడు ప్రాంతానికి చెందిన దొంతుల మాలతి (21) హైదరాబాద్ నగరంలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె ఇటీవలే సొంతూరు వచ్చింది. ఇంటిల్లి పాదితో సంబురంగా గడిపింది. బంధుమిత్రులతో ఆనందం పంచుకుంది.

గత ఆదివారం అమ్మానాన్నలతో కలిసి పొలం పనులకు వెళ్లింది. ఇంట్లో ఉన్న చొక్కా వేసుకొని వెళ్లిన ఆమె దానిలో ఉన్న విషపు గుళికను కనిపెట్టలేక పోయింది. ఆమె తోటి వారితో కలిసి పొలం పనులు చేస్తుండగా చొక్కాలోకి వచ్చిన తేలు పలుమార్లు, పలుచోట్ల కాటేసింది.

ఈ మేరకు ఆమెను వైద్య చికిత్సల కోసం కరీంనగర్ కు తరలించారు. ఆమె అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.