హైదరాబాద్ లో మరో దారుణం

హైదరాబాద్ నగరంలో అమ్నేషియా పబ్ ఘటనను ప్రజలు మరువక ముందే మరో పబ్ లో జరిగిన ఘటన ఆందోళనకు గురి చేసింది. యువతిపై కొందరు దుండగులు దౌర్జన్యంగా వేధించిన ఘటన బయటకొచ్చింది. ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని ఓ పబ్ కు యూఎన్వో కోసం పనిచేసే ఓ యువతి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆదివారం అర్ధరాత్రి వెళ్లింది. అక్కడ ఆమెను చూసిన ఇద్దరు యువకులు ఫోన్ నెంబర్ ఇవ్వాలని కోరారు. దానికి ఆ యువతి నిరాకరించింది.

ఆ ఇద్దరితో పాటు మరో ఆరుగురు దుండగులు పూటుగా మద్యం తాగొచ్చి ఆ యువతిని పబ్ బయటకు బలవంతంగా తీసుకెళ్లి రేప్ చేస్తామంటూ బెదిరించారు. ఆ యువతిపై అసభ్యంగా ప్రవర్తించారు.

ఈ సమయంలో ఆమెకు తోడుగా వచ్చిన ఇద్దరు స్నేహితులు ఆ దుండగులను అడ్డుకోబోయారు. ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. దీంతో వారిద్దరిపై ఆ దుండగులు మద్యం సీసాలతో దాడి చేసి తలలు పగలగొట్టారు. వారిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

బాధితురాలిని రక్షించేందుకు ఆ పబ్ సిబ్బంది కూడా ప్రయత్నం చేశారు. నిందితులంతా ఒక్కసారిగా సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడ్డారని తెలిసింది. తెల్లవారుజాము వరకూ యువతిపై ఆ దుండగుల అసభ్య ప్రవర్తన కొనసాగిందని సమాచారం.

ఎంతగా వారించినా వారు మరింత రెచ్చిపోయి తమ ప్రతాపం చూపేందుకే యత్నించినట్లు తెలిసింది. వారిలో బడాబాబుల కొడుకులున్నారని సమాచారం.

ఈ మేరకు బాధితురాలు తనకు జరిగిన అవమానంపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు పబ్ లో విచారణ జరుపుతున్నారు. సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తే నిందితులెవరో తేలే అవకాశముంది.