అంబికా ది గ్రేట్

గౌరవం కోసం ఓ ఇల్లాలి తపన ఫలించింది..

  ఆమె భర్త ఓ పోలీస్ కానిస్టేబుల్. ఆమెకు 14ఏళ్ల వయసప్పుడే తల్లిదండ్రులు వివాహం చేశారు. నాలుగేళ్లకే ఇద్దరు పిల్లలు కలిగారు. భర్తకు, పిల్లలకూ సేవలందిస్తూ కుటుంబమే పరమావధిగా ఉంటోంది. కానీ ఓ రోజు టిఫిన్ ఇచ్చేందుకుని పరేడులో పాల్గొన్న భర్త వద్దకు వెళ్లింది. అక్కడ జరిగిన ఓ ఘటనే వారి జీవితంలో కీలక మలుపు తిప్పింది. ఆమె గొప్పగా నిలిచేందుకు ప్రేరణ కలిగించింది. ఇప్పడు ఆమె ఇప్పడు దేశంలోనే ఎందరికో స్ఫూర్తిని నింపే మహిళగా నిలిచింది.

అంబిక దిగువ మధ్యతరగతికి చెందిన మహిళ. ఆమె భర్త తమిళనాడు రాష్ట్రంలోని దిండుక్కల్ పోలీస్ స్టేషన్ లో అప్పడు కానిస్టేబుల్. భర్త, ఇద్దరు పిల్లలే ఆమె లోకం అనుకునే ఓ సాధారణ ఇల్లాలు. ఓ రోజు ఉదయాన్నే టిఫిన్ కూడా తినకుండా పరేడుకు టైం అవుతుందని ఆదరాబాదరాగా ఆమె భర్త వెళ్లిపోయాడు.

ఎంతకూ తిరిగిరాకపోవడంతో టిఫిన్ తీసుకొని తన పిల్లలతో కలిసి పరేడ్ గ్రౌండుకు వెళ్లింది. ఆమె భర్త పరేడ్ లో ఉన్నాడు. పక్కనే పిల్లలతో నిల్చొని చూస్తోంది. కానిస్టేబుల్ అయిన ఆమె భర్త అక్కడి పలువురి వద్దకు వెళ్లి ఆయన వంగివంగి సెల్యూట్ చేశాడు.

భర్త ఇంటికొచ్చాక అడుగుతుంది. నీకంటే చిన్న వయసులో ఉన్న వారికి నువు సెల్యూట్ చేయడమేంటి.. అని అడిగింది. అందుకు ఆయన వివరించారు. ఒకాయన డీసీపీ, పక్కనే ఉంది ఐజీ. తనకంటే పెద్ద వాళ్లు. అందుకే సెల్యూట్ చేశా.. అని సెలవిచ్చాడు.

అదే ఆమెలో తెలియని పట్టుదల పెంచింది. నేను అంత పద్ద ఆఫీసర్ను అయితే నాకు సెల్యూట్ చేస్తావా.. అంటూ ఆ మహిళ తన భర్తను అడిగింది.. అందుకు ఆయన చిరునవ్వు నవ్వాడు. జోక్ అనుకొని, ముందు నువ్వు టెన్త్ పాస్ గా.. అప్పుడు చూద్దాం.. అంటూ ఉచిత సలహా ఇచ్చాడు.. కానీ ఆమె నిజంగానే లక్ష్యం ఏర్పర్చుకుంది. ఐపీఎస్ కావాలని ధృడంగా నిర్ణయించుకుంది.

తర్వాత ఆమె భర్త కూడా ఆమె పట్టుదలను కాదనలేకపోయాడు. ప్రోత్సాహన్ని అందించేందుకు ముందుకొచ్చాడు. ఇతర కుటుంబసభ్యులూ బాసటగా నిలిచారు. కానీ కనీసం టెన్త్ ఉత్తీర్ణత సాధించలేని ఆ గృహిణికి ఐపీఎస్ సాధించాలంటే అంత సులువేం కాదు. కానీ నిబ్బరంగా ముందుకు సాగింది.

అంబిక ఏపీఎస్ అధికారి కావాలని సంకల్పం ఎంచుకున్నప్పుడు ఆమె 10వ తరగతి పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించలేదనే వాస్తవం ఆమెను భయానికి గురి చేయలేదు. ఆమె మొదట 10వ తరగతి, 12వ తరగతి ఒక ప్రైవేటు సంస్థలో  చదివి పూర్తి చేసింది. పదో తరగతిలో 500 మార్కులకు గాను 477 మార్కులు సాధించి దానిని పునాదిగా మలుచుకుంది. ఆ తర్వాత ఆమె బీఏ డిగ్రీ కూడా పూర్తి చేసింది. ఇవన్నీ తమిళ మీడియంలోనే చదవడం గమనార్హం.

ఐపీఎస్ అధికారి కావాలంటే అంబిక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. పరీక్షకు ప్రిపేర్ కావాలంటే వారుండే ప్రాంతంలో శిక్షణ సంస్థలు లేవు. దీంతో ఆమె చెన్నై నగరానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడే ఆమె భర్త భరోసా ఇచ్చాడు. తన ఉద్యోగం చేయడంతో పాటు పిల్లలను చూసుకుంటానని, ఆమెను ఐపీఎస్ పీరీక్షలకు సిద్ధమయ్యేందుకు చెన్నై పంపించాడు.

కానీ అక్కడి నుంచి అంబిక ప్రయాణం సాఫీగా సాగలేదు. ఆమె సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ లో విఫలమైంది. రెండోసారి మెయిన్స్ రాసినా ఫలితం దక్కలేదు. మూడోసారి అదే పునరావృతమైంది.

మూడుసార్లు ఫెయిలైన తర్వాత అంబిక భర్త ఆమెను ఇంటికి తిరిగి రమ్మని కోరాడు. కానీ అంబిక పట్టు వదల్లేదు. చివరిసారిగా పరీక్షకు హాజరు కావడానికి ఆమె తన భర్తను ఒప్పించింది. ఈ సారి రాకుంటే టీచర్ ఉద్యోగంలో చేరుతానని చెప్పింది.

ఆమె నాలుగో ప్రయత్నంగా 2008లో అంబిక సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. అంబికకు మహారాష్ట్ర కేడర్‌ కేటాయించారు. ప్రస్తుతం ముంబై నగరంలో ఆమె డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్నారు.

మొదట మహారాష్ట్రలోని గంగానాపూర్ తాలూకాలో పిల్లల మిస్సింగ్ కేసులు ఛేదించిన అంబిక అందరి చేత ప్రశంసలు అందుకుంది. తర్వాత చైన్ స్నాచింగ్ కేసులు ఎన్నో క్లిష్టమై కేసులు ఛేదించి ముంబై సింగం అని అనిపించుకుంది.

ఒకప్పుడు తమిళం మాత్రమే తెలిసిన అంబిక మరాఠాలో ఘంటాపథంగా మాట్లాడుతూ మరాఠా ప్రజలకు చేరువైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ‘లోక్ మత్ మహారాష్ట్రీయన్’ పురస్కారాన్ని దక్కించుకొంది. గౌరవం కోసం ఓ ఇల్లాలు పట్టుదలతో అదే గౌరవం పొందే స్థాయికి చేరుకొని శభాష్ అనిపించుకుంది. అందుకే ‘‘అంబికా ది గ్రేట్’’ అని పొగడాలనిపించింది.