‘ఆ కటిక పేద’ కుటుంబానికి ఆపన్నహస్తం

• ముందుకొచ్చిన మానవతావాదులు
వెంకటాపూర్ (రామప్ప) : వెంకటాపురం మండల కేంద్రంలోని శ్మశాన వాటికలో తుది శ్వాస విడిచిన లక్ష్మణాచారి కుటుంబానికి మానవతావాదులు ఆసరాగా నిలిచారు. పేదరికం తెచ్చిన కష్టాలతో అర్ధాంతరంగా అసువులు బాసిన వృత్తిదారుడి కుటుంబానికి చేయూతగా నిలిచి మానవత్వం చాటుకున్నారు.

ఇటీవల వెన్నెముఖ వ్యాధితో బాధపడుతూ బతుకు దెరువు లేక, సొంత గూడు కరువై, ఆస్పత్రిలో చికిత్స కూడా చేయించుకోలేని స్థితిలో కన్నుమూసిన లక్ష్మణాచారి కుటుంబానికి మానవతావాదులు వితరణ చాటుతున్నారు.

ఈ మేరకు శనివారం తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు బిక్షపతి, సంఘం హనుమకొండ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు కర్ణకంటి శ్రీనివాసాచారి, రాష్ట్ర నాయకులు కూరెల్ల రామాచారి, వెంకట ములుగు జిల్లా అధ్యక్షుడు రాజన్న, కార్యదర్శి నరసింహాచారి, వెంకటాపూర్ మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కూరెళ్ళ సాంబయ్య, ఇతర సంఘం నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

తాము సేకరించిన నగదుతో గ్రామంలోనే స్థలం కొనుగోలు చేస్తామని ఎర్రోజు బిక్షపతి తెలిపారు. ఆ స్థలంలో తాత్కాలిక వసతి కోసం రేకుల షెడ్డు నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. కుటుంబానికి ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని వారు కోరారు.