బాలుడిని మింగిన మొసలి.. ఉమ్మేస్తుందని పట్టుకొచ్చిన స్థానికులు

బాలుడిని మింగిన మొసలి.. ఉమ్మేస్తుందని పట్టుకొచ్చిన స్థానికులు

రచ్చబండ : స్నానికని నది ఒడ్డుకు వెళ్లిన ఓ బాలుడిని చడీ చప్పుడు కాకుండా వచ్చిన ఓ మొసలి అమాంతం మింగేసింది. ఈ ఘటనను కళ్లారా చూసిన స్థానికులు ఆ మొసలి ఎలాగోలా పట్టుకొచ్చారు. ఆ బాలుడిని ఉమ్మేస్తుందని ఎదురు చూశారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షీపుర్ లో సోమవారం ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. స్థానికుడైన ఓ పదేళ్ల బాలుడు సమీపంలోని చంబల్ నదిలో స్నానం చేస్తుండగా, ఎలాంటి శబ్ధం చేయకుండా వెనుక నుంచి వచ్చిన ఓ మొసలి ఆ బాలుడిపై దాడి చేసి అమాంతం మింగేసింది.

అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనను కళ్లారా చూసిన స్థానికులు వలలు, కర్రల సాయంతో ఆ మొసలిని పట్టుకొని ఒడ్డుకు చేర్చారు. విషయం తెలిసిన గ్రామస్థులు, అటవీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మొసలిని తిరిగి నదిలో వదిలేయాలని అటవీ అధికారులు కోరారు.

బాలుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అటవీ అధికారుల సూచనకు ఒప్పుకోలేదు. దాని పొట్టలో ఉన్న తమ బిడ్డ బతికే ఉండొచ్చని, అది ఉమ్మేసే వరకూ కదిలేది లేదని కుటుంబ సభ్యులు భీష్మించుకొని అక్కడే కూర్చున్నారు.

మొసలి మింగేసిన తర్వాత చనిపోయి ఉంటాడని, బతికే ఛాన్స్ లేదని అటవీ అధికారులు వారికి నచ్చజెప్పారు. ఈ లోగా వారి ఆశలు అడియాశలు కావడంతో ఎట్టకేలకు సాయంత్రం ఆ మొసలిని నదిలోకి వదిలారు.