‘ఉచితం’గా 31 మంది ప్రాణాలు బలి

ఫ్రీ అనగానే మనోళ్లు ముందు వెనుకా చూడకుండా క్యూ కట్టేస్తారు. స్థోమత ఉన్నా ఫ్రీయే కదా అని కొట్టేస్తారు. మన బదులు ఓ నిరుపేదకు మేలు కలుగుతుంది కదా.. అని అనుకునే వాళ్లు తక్కువ. ఇక్కడా ఇదే జరిగింది. ఫ్రీ అన్న ప్రకటనకు స్పందించిన వారు పెద్ద సంఖ్యలో పోగవడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

నైజీరియాలోని పోర్ట్ హార్ కోర్టు సిటీలో ఉన్న ఓ చర్చిలో ఓ ఈవెంట్ నిర్వహించారు. దీనికోసం ఉచితంగా కానుకలు ఉంటాయని ప్రకటించారు. ఇంకేముందు భారీ సంఖ్యలో జనం తరలి వెళ్లారు. గేటు వద్ద పోగయ్యారు. ఆలస్యం కావడంతో అసహనంతో వారిలో కొందరు గేటును పగలగొట్టారు.

ఈవెంటులో భాగంగా స్వీట్లు, కానుకలు పంపిణీ చేసే సందర్భంగా ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. దీంతో గేటు నుంచి పంపిణీ చేసే చోటుకు పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకొంది. ఈ ఘటనలో 31 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నట్లు బయట పడింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. చూశారా.. ఉచితం అన్న మాట వారి ప్రాణాలమీదికే తెచ్చింది.