ఇది విన్నారా!?

పెట్రో ధరల పెరుగుదలతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. నిత్యం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల భారం ఆయా వర్గాలను కుంగదీస్తోంది. అయితే పాలకులు కనికరం చూపడం లేదంటూ కసురుకోవడం పరిపాటిగా మారింది.

పెట్రో ధరల పెంపు భారం మీదంటే మీదంటూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. వీటి నడుమ వినియోగదారుల్లో నిజంగా అయోమయం నెలకొంది. అసలు ఎవరిది భారమంటూ ఆలోచనల్లో పడటం వారి వంతయింది.

ఈ దశలో ‘‘కేంద్ర ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ డ్యూటీ పన్నును కొంత మేరకు తగ్గించాము.. మీరు విధించిన పన్నులను కొంత మేరకు తగ్గించండి..’’ అని ప్రధాని మోదీ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలు చేయగా, బీజేపీయేతర రాష్ట్రాల్లో అమలు కాలేదన్నది బహిరంగ సత్యమే.

ఎవరు భారం పెంచారు.. ఎవరు దించారో.. ఏమో కానీ.. భారం మాత్రం తమదే కదా.. అని వినియోగదారులు ఉసూరుమంటున్నారు. అయితే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నడుమ డీజిల్ ధరలో వ్యత్యాసం మాత్రం ఆలోచనల్లో పడేసింది.

తెలంగాణలో డీజిల్ లీటరు ధర రూ.106.76గా ఉంది. అదే పొరుగున ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో మాత్రం రూ.95.57గా ఉంది. ఆ రాష్ట్ర విధించిన పన్నులను కొంత మేరకు తగ్గించడంతో ఈ మాత్రం ధర తగ్గిందని తేలింది.

మనకన్నా కర్ణాటకలో డీజిల్ ధర తక్కవగా ఉండటంతో సమీప పొరుగు ప్రాంతాల వినియోగదారులు అక్కడి బంకుల్లో డీజిల్ పోయించుకునేందుకు వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా ఆర్టీసీ లాంటి ప్రభుత్వరంగ సంస్థలు అక్కడి నుంచి టోకున డీజిల్ పోయించుకుంటున్నారు.

కర్ణాటకలోని బీదర్, ఇతర ప్రాంతాల నుంచి సమీపంలోని తెలంగాణ ఆర్టీసీ డిపోలైన నారాయణఖేడ్, జహీరాబాద్ కు డీజిల్ తెచ్చుకుంటున్నట్లు వార్తలు రావడంతో అసలు విషయం బయటకు పొక్కింది. ఏదైతేనేమి ప్రస్తుత కటువు పరిస్థితుల్లో మన రాష్ట్రం కన్నా డీజిల్ తక్కువ ధరకే కర్ణాటకలో దొరకడంపై కొంత ఆలోచించాల్సిన విషయమే కదా..