శంకర్ పల్లి మండలంలో ఘోర ప్రమాదం

శంకర్ పల్లి మండలంలో ఘోర ప్రమాదం


* ఇద్దరు యువకుల దుర్మరణం
* కళాశాల విద్యార్థుల కారు ఢీకొనడంతో ప్రమాదం
* ఇక్ఫాయి కళాశాల గేటు వద్ద జనవాడ గ్రామస్తుల ధర్నా
రచ్చబండ, శంకర్ పల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్ పల్లి మండలం జనవాడ గ్రామానికి చెందిన బేగరి రాజు (40), కురుమ శ్రీశైలం(32) బుధవారం రోజున 9:30 గంటల ప్రాంతంలో బైక్ పై నల్లగండ్లకు బయలుదేరారు.

కొల్లూరు గేట్ దాటగానే ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో తీవ్ర గాయా లై బేగరి రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన కురుమ శ్రీశైలంను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మోకిలా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ప్రమాదానికి కారణమైన ఇక్ఫాయి కళాశాల విద్యార్థులు తప్పించుకొని పారిపోయారు. అయితే ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న జనవాడ గ్రామస్తులు ఇక్ఫాయి కళాశాల వద్ద గంటకు పైగా ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని, విద్యార్థులు అతివేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. కళాశాలకు వచ్చే విద్యార్థులు వాహనాలను ఆతివేగంతో నడపడంతో తమ గ్రామానికి చెందిన వారు ఇప్పటికే నలుగురు మృతి చెందారని, టంగుటూరు గ్రామస్తులు ఇద్దరు మృతి చెందారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రమాదానికి కారణమైన విద్యార్థులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. మోకిలా సిఐ నరేష్, శంకర్ పల్లి సీఐ గణేష్ రెడ్డి, మోకిలా ఎస్సై కోటేశ్వరరావు పోలీస్ సిబ్బంది కళాశాల వద్దకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. హైదరాబాద్ రోడ్డులో కొంతసేపు జనవాడ గ్రామస్తులు రోడ్డుపై కూర్చొని వాహనాల రాకపోకలను నిలిపివేశారు.